బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం..

మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విశాఖ జిల్లా సింహాచల దేవస్థానంలో నిర్వహించిన చందనోత్సవ వేడుకల్లో గోడ కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలను ఆయన ఈరోజు పరామర్శించారు.

చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్న జగన్, ప్రమాదంలో మృతిచెందిన ఉమామహేష్, శైలజ భౌతికదేహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను కలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ హృదయవిదారక ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. భక్తుల భద్రతపై ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని వ్యాఖ్యానించారు. రూ.300 టికెట్ క్యూలైన్‌పై గోడ కూలిపోవడం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని జగన్ కోరారు. బాధితుల పట్ల ప్రభుత్వానికి మానవతా దృక్కోణంతో స్పందించాలని ఆయన సూచించారు.

Read More : విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.

One thought on “బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం..

Comments are closed.