చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై CA ఫైనల్ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పరీక్షలు సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే నిర్వహించేవారు. అయితే, విద్యార్థుల అభ్యర్థనల నేపథ్యంలో ఈ మార్పును అమలు చేస్తున్నట్లు ICAI స్పష్టం చేసింది.
గతంలో ఇంటర్మీడియట్, ఫౌండేషన్ స్థాయిల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ICAI గుర్తుచేసింది. విద్యార్థులకు మరింత అవకాశాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ కీలక మార్పును తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఇకపై CA ఫైనల్ పరీక్షలు ప్రతి సంవత్సరం జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్లు ICAI స్పష్టం చేసింది.
ICAI ప్రకటన ప్రకారం, ఈ కొత్త షెడ్యూల్ వల్ల విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, పరీక్ష రాసే అవకాశం పెరగడం ద్వారా వారు తమ లక్ష్యాన్ని త్వరగా చేరుకునే వీలుంటుందని పేర్కొంది. పూర్తి షెడ్యూల్ త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది.
