విజయ్ రూపానీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతితో దేశంలో తీవ్ర విషాదం నెలకొంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు.

లండన్‌లో నివాసం ఉన్న తన భార్య, కుమార్తెను కలుసుకోవడానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మునుపు మే 19, జూన్ 5 తేదీల్లో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న విజయ్ రూపానీ, చివరికి జూన్ 12న లండన్ బయలుదేరారు. అదే చివరి ప్రయాణమైంది. జూన్ 25న తిరిగి రావాలని ఆయన అనుకున్నారు. విమానం ఎక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో ఉత్సాహంగా ఉన్న రూపానీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియోలో రికార్డ్ చేశారు.

జూన్ 12న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. సమీపంలోని మెడికో హాస్టల్‌పై పడిన ఈ విమానం భారీ ప్రాణ నష్టానికి దారితీసింది. సుమారు 1,25,000 లీటర్ల ఇంధనం ఉండటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో ఒక ప్రయాణీకుడు మాత్రమే స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు, విజయ్ రూపానీతో సహా మిగిలిన 241 మంది మరణించారు. హాస్టల్‌లో కూడా 35 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

విజయ్ రూపానీ అంత్యక్రియలు ఈరోజు రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన స్మారకార్థం గుజరాత్ ప్రభుత్వం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఈ అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.

Read More : Delhi : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం