ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, మెరుపు వరదలు విపరీతమైన నష్టం మిగులుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామంలో పరిస్థితి దయనీయంగా మారింది. కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో గ్రామం మొత్తం ముంచెత్తబడింది. ఈ విపత్తులో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరద నీటిలో గల్లంతైనట్లు సమాచారం. వరద ప్రభావిత గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉండటంతో, హర్షిల్ ఆర్మీ క్యాంప్ పరిధిలో ఉన్న సైనికులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన సైనికుల కోసం సైన్యం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. ధరాలీ గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం మరియు ఎన్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
150 మంది సభ్యుల బృందం సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. తమ సైనికులు గల్లంతైనప్పటికీ, ఆర్మీ నిరాటంకంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అయితే బురద మేటలు, దెబ్బతిన్న ఇళ్లు, దుకాణాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ వరద బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలను కలచివేస్తున్నాయి.
Read More : శ్రీలంక నేవీ మరోసారి భారత జాలర్ల అరెస్ట్

One thought on “ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం : Update”
Comments are closed.