అమెరికాలో లేబర్ డే సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. కార్మికులకు తగిన జీవన భృతి కల్పించాలని, కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్, షికాగో, వాషింగ్టన్ డీసీ సహా పలు ప్రధాన నగరాల్లో వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు.
‘వన్ ఫెయిర్ వేజ్’ సంస్థ ఆధ్వర్యంలో న్యూయార్క్, షికాగోలో జరిగిన ప్రదర్శనల్లో నిరసనకారులు గంటకు 7.25 డాలర్ల ఫెడరల్ కనీస వేతనం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్ ట్రంప్ టవర్ వెలుపల “ట్రంప్ వెంటనే దిగిపోవాలి” అంటూ నినాదాలు చేయగా, షికాగోలోని ట్రంప్ టవర్ వద్ద “నేషనల్ గార్డ్ వద్దు”, “అతడిని జైల్లో పెట్టండి” అంటూ గట్టిగా అరుస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ నిరసనల్లో పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. షికాగోలో మేయర్ డానియల్ బిస్ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యం, ప్రాథమిక విలువలు దాడికి గురవుతున్నాయి. కార్మికుల హక్కుల కోసం మనమందరం పోరాడాలి” అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఓ మహిళ “లాంగ్ లివ్ డొనాల్డ్ ట్రంప్” అని నినదించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారుల ప్రతినినాదాలతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. పశ్చిమ తీర నగరాలైన శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, పోర్ట్లాండ్, సియాటెల్‌లో కూడా ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. బిలియనీర్ల ఆధిపత్యాన్ని అరికట్టాలని, వలసదారుల హక్కులను రక్షించాలని, ఫెడరల్ ఉద్యోగులకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలు, ఆర్థిక స్థబ్దత వలసదారులను బలిపశువులుగా మార్చేస్తోందని నిరసనకారిణి జిరి మార్క్వెజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ, వలస విధానాలు, సామాజిక భద్రత వంటి సమస్యలపై విసుగు కారణంగా తాను ఈ నిరసనలో పాల్గొన్నానని పోర్ట్‌లాండ్‌కు చెందిన లిండా ఓక్లీ తెలిపారు.
Read More : రష్యా చమురుపై భారత్‌కి భారీ రాయితీలు
One thought on “అమెరికాలో లేబర్ డే నిరసనలు – ట్రంప్ వ్యతిరేక నినాదాలు.”
Comments are closed.