ఉక్రెయిన్ సంక్షోభంపై మరోసారి తన స్పష్టమైన వైఖరిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై తెలియజేశారు. యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయన సూచించారు. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, “ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం. ఈ ఘర్షణను త్వరగా ముగించుకుని శాంతి, స్థిరత్వం నెలకొల్పే మార్గాలను కనుగొనాలి. ఇది మానవాళి మొత్తం ఆశ” అని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలకు పుతిన్ సానుకూలంగా స్పందించారు. ఎస్‌సీఓ సదస్సులో మాట్లాడుతూ, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారంలో భారత్, చైనా వంటి వ్యూహాత్మక భాగస్వాముల సహకారం విలువైనదని అన్నారు. అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల కుదిరిన అవగాహనలు ఉక్రెయిన్ శాంతికి దోహదం చేస్తున్నాయని గుర్తుచేశారు.
తరువాత ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ, పుతిన్‌తో సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. వాణిజ్యం, ఎరువులు, అంతరిక్షం, భద్రత, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేయడంపై చర్చించామని చెప్పారు. “ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కోసం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మేం అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి కీలకమైన స్తంభం” అని మోదీ అన్నారు.
అదే సమయంలో, ఎస్‌సీఓ సదస్సు కోసం మోదీ చైనాకు చేరుకున్న వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆయనతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూరప్ నేతలతో జరిగిన చర్చల వివరాలను జెలెన్‌స్కీ మోదీకి తెలియజేశారు. దీనికి స్పందించిన మోదీ, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్ కట్టుబడి ఉందని, రష్యాకు సరైన సందేశం పంపేందుకు ఎస్‌సీఓ వేదికను వినియోగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Read More : ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం బీభత్సం.

One thought on “ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ స్పష్టమైన సందేశం.”
Comments are closed.