ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. పరస్పరం క్షిపణి దాడులు జరుపుకుంటున్న ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని స్వదేశానికి తిరిగారు.
జీ7 సదస్సులో పాల్గొంటున్న ట్రంప్, ముందుగా పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. అయితే పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో ట్రంప్ అత్యవసరంగా అమెరికా తిరుగు ప్రయాణం కావలసి వచ్చిందని ఆమె తెలిపారు.
జీ7 నేతలతో చివరి భేటీ – తక్షణమే వెళ్తానన్న ట్రంప్
ట్రంప్ నిన్న సాయంత్రం జీ7 దేశాధినేతలతో గ్రూప్ ఫోటోలో పాల్గొన్న తర్వాత, “నేను తక్షణమే వెళ్తా, ఇది అత్యవసరం,” అని తోటి నేతలకు చెప్పినట్టు సమాచారం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఈ నిర్ణయాన్ని మద్దతుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత భయానక స్థితికి వెళ్లకుండా తక్షణమే శాంతి ఏర్పడాలని జీ7 నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
అమెరికాలో అత్యవసర భద్రతా సమావేశానికి సన్నాహాలు
అమెరికాకు చేరుకున్న వెంటనే ట్రంప్, జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. వైట్‌హౌస్‌లోని సిట్యుయేషన్ రూమ్‌లో భద్రతా వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇప్పటికే ఆదేశించారని సమాచారం. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కొన్ని కీలక భద్రతా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా. అంతర్జాతీయ మిత్రదేశాలతో సంప్రదింపులు, వ్యూహాత్మక చర్యలపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముందని వైట్‌హౌస్ వర్గాలు సూచిస్తున్నాయి.
