తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రక్షణ చర్యల కోసం రాష్ట్రానికి మూడు ఆర్మీ హెలికాప్టర్లు రావాల్సి ఉంది. అయితే చాపర్లు ఆలస్యంగా చేరడంతో కేంద్ర రక్షణ శాఖ అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
అధికారులు ఇప్పటికే హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ, వర్షాల ప్రభావం కారణంగా అవి బాధిత ప్రాంతాలకు చేరడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. నాందెడ్, బీదర్ స్టేషన్ల నుంచి హెలికాప్టర్లను పంపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని బండి సంజయ్ వివరించారు.
భారీ వర్షాల వల్ల ఎస్సారెస్పీ, మానేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలని సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ముమ్మరంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముప్పు ప్రాంతాల వారిని అధికారులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అత్యవసరం తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తూ, ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
Read More : మరోసారి గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

One thought on “Minister – వరద రక్షణ చర్యలకు హెలికాప్టర్ల ఏర్పాట్లు”
Comments are closed.