కడపలో చరిత్ర సృష్టించిన TDP మహానాడు: CM

తొలిసారిగా దేవుని గడప కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకం అని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కడప మహానగరంలో ప్రారంభమైన మహానాడు సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు.

పార్టీ విజయానికి కార్యకర్తలే కారణం

తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తల పోరాటమే ప్రధాన బలం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 7 చోట్ల టీడీపీ గెలిచిందని చెప్పారు. ఈసారి అన్నీ స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దుర్మార్గ పాలనకు పోరాటమే జవాబు

గత ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కిపారేసిందని, అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను హింసించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఆ పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. చంద్రన్న హత్యతో పాటు, అనేకమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేసిన విషాదాన్ని ఆయన గుర్తు చేశారు.

లోకేష్ యువగళం… కార్యకర్తల ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం

తన పాదయాత్ర నుంచి లోకేష్ యువగళం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి కొనసాగిందని చంద్రబాబు పేర్కొన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీ పునాది అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం టీడీపీ నిరంతరం పనిచేస్తోందన్నారు.

సామాజిక న్యాయానికి తెలుగుదేశమే మార్గదర్శి

పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, రూ.2 బియ్యం, సబ్సిడీ కరెంట్ వంటి అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారా సాధ్యమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.

అవినీతిరహిత పాలన, భద్రత, భవిష్యత్‌పై దృష్టి

ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడిన పాలనను అందించామని, జవాబుదారీతనాన్ని రాజ్యాంగ స్థాయిలో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశానిదేనన్నారు. భావితరాల భవిష్యత్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. “స్టేట్ ఫస్ట్” అన్నదే తమ పార్టీ నినాదమని స్పష్టం చేశారు.