సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “ఆకాశమే హద్దురా” చిత్రం సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద ఏడేళ్ల పాటు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర, యదార్థ సంఘటనల ఆధారంగా సరికొత్త కథల్ని ఎంచుకుంటూ తనదైన శైలిలో దర్శకురాలిగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. “సింప్లీ ఫ్లై డెక్కన్” ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు మరో సమస్యాత్మక కథతో “పరాశక్తి” పేరుతో సుధా కొంగర తన కొత్త సినిమాను ప్రారంభించారు. 1965 హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలో శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. జయం రవి, అధర్వ, మలయాళ క్రేజీ హీరో బాసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల చేయాలని దర్శకురాలు ప్లాన్ చేస్తున్నారు.
దక్షిణాదిపై కేంద్రం బలవంతంగా హిందీ భాషను రుద్దుతోందనే విమర్శల నేపథ్యంలో, సుధా కొంగర ఈ సున్నితమైన అంశాన్ని తెరకెక్కించనుండటం ఆసక్తికరంగా మారింది. 1965లో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న “పరాశక్తి”పై ఇప్పటికే పెద్ద చర్చ మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముడతాయా? అనేది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

One thought on “పరాశక్తితో కలకలం రేపుతున్న సుధా కొంగర!”
Comments are closed.