తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎస్‌ఎస్ స్టాన్లీ ఇకలేరు. ఆయన ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 58ఏళ్ల వయసులో మృతిచెందారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన “ఏప్రిల్ మాధతిల్”, పుదుక్కోటై సరవణన్”, “మెర్క్యురీ పూక్కల్” సినిమాలు ఓ మంచి గుర్తింపు తెచ్చాయి.
దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన స్టాన్లీ, ప్రముఖ దర్శకులు మహేంద్రన్, శశి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. 2002లో శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన “ఏప్రిల్ మాధతిల్”తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ కావడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ధనుష్ హీరోగా చేసిన “పుదుక్కోటై సరవణన్”కి కూడా దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా కథను ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆయన భావించేవారు. ఆ తర్వాత కొంతకాలం ఆర్థిక కారణాల వల్ల దర్శకత్వానికి విరామం ఇచ్చారు.
తర్వాత ఆయన నటుడిగా మారి పలు సినిమాల్లో నటించారు. 2007లో విడుదలైన “పెరియార్” చిత్రంలో సి.ఎన్.అన్నాదురై పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. విక్రమ్ నటించిన “రావణన్”, విజయ్ హీరోగా వచ్చిన “సర్కార్”, విజయ్ సేతుపతి నటించిన “మహారాజా” వంటి సినిమాల్లో కూడా కనిపించారు. 2015లో మురుగదాస్ బ్యానర్‌లో “ఆడమ్ యాపిల్” అనే చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉన్నా, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం చెన్నై వలసరవాక్కంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

One thought on “తమిళ దర్శకుడు, నటుడు SS స్టాన్లీ కన్నుమూత”
Comments are closed.