శ్రీ సత్యసాయి జిల్లాలో చిన్న లోన్ కమీషన్ గొడవ ప్రాణాంతకంగా మారింది. తాజాగా తండ్రైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. బిడ్డకు నామకరణం జరగాల్సిన ఇంట్లో కన్నీటి వాతావరణం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం, తలుపుల మండలానికి చెందిన శ్రీకాంత్ (30) శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దాడికి గురయ్యాడు. లోన్ కమీషన్ విషయంలో తలెత్తిన వివాదంలో రాజారాం కత్తితో శ్రీకాంత్ తొడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.
శ్రీకాంత్ బావమరిది అనిరుధ్ బ్యాంకుల్లో రుణాలు ఇప్పించే పనిలో ఉంటాడు. బలిజపేటకు చెందిన శోభకు రుణం మంజూరు చేయడంలో రాజారాం సహకరించాడు. అయితే కమీషన్ ఇవ్వాలంటూ రాజారాం పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ కోపంతో శనివారం రాత్రి రాజారాం అనిరుధ్ ఇంటికెళ్లి బైక్‌ను ధ్వంసం చేశాడు.
విషయం తెలుసుకున్న అనిరుధ్, అతని తండ్రి శ్రీనివాసులు, బావమరిది శ్రీకాంత్ కలిసి రాజారాం ఇంటికి వెళ్లారు. అయితే ముందుగానే సిద్ధమైన రాజారాం కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో అనిరుధ్, శ్రీనివాసులు కూడా గాయపడ్డారు. ఘటన అనంతరం రాజారాం పరారీలో ఉండగా, అతనికి సహకరించిన ఆరోపణలపై తండ్రి వెంకటరాయప్ప, తరుణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలో కన్నీటి వాతావరణం నెలకొంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్, తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణయ్యకు ఏకైక కుమారుడు. ఇటీవలే కుమారుడు జన్మించగా, నామకరణం జరపాలని కుటుంబం సిద్ధమవుతుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.
Read More : టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర?
One thought on “శ్రీ సత్యసాయి జిల్లాలో లోన్ కమీషన్ గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య.”
Comments are closed.