తమిళనాడు శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

తమిళనాడులోని విఖ్యాత టపాసుల తయారీ కేంద్రం శివకాశిలో మరోసారి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో పొగలు అలుముకున్నాయి. మంటల్లో చిక్కుకున్న నలుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. మిగతా గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదా రసాయనాల తారుమారైన మిశ్రమం వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. శివకాశిలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం స్థానికులను తీవ్ర ఆందోళనలో ముంచుతోంది. కార్మికుల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలన్న డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి.

Read More : పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన ప్రేమజంట దుర్మరణం

One thought on “తమిళనాడు శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Comments are closed.