నా కెరీర్ ముగిసిందని ఆ రోజే తెలిసింది: ధావన్

గత దశాబ్ద కాలంలో టీమిండియాకు అత్యుత్తమ ఓపెనర్‌గా నిలిచిన శిఖర్ ధావన్, జాతీయ జట్టులో నుంచి తన వైదొలగింపుపై ఎట్టకేలకు స్పందించారు. వన్డేల్లో మంచి ఫార్మ్‌లో ఉన్నప్పటికీ టీమ్ నుంచి తప్పించడంపై తన భావాలను ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ధావన్ మాట్లాడుతూ – “నేను వన్డేల్లో 50లు, 70లు చేయగలిగినా, పెద్ద శతకాలు నమోదు చేయలేకపోయాను. ఆ సమయంలో ఇషాన్ కిషన్ 200 పరుగుల డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో నాకు ఏదో లోపలినుంచి ‘ఇది నీ అంతర్జాతీయ కెరీర్ ముగింపు కావచ్చు’ అనే గళం వినిపించింది. ఆ తరువాత జట్టులో నాకు చోటు దక్కలేదు. నా స్నేహితులు నాకు ధైర్యం చెప్పడానికి వచ్చారు. కానీ నేను మాత్రం ఎంతో ప్రశాంతంగా, ఆత్మస్థైర్యంతోనే ఉండగలిగాను” అని పేర్కొన్నారు. 2023 వన్డే వరల్డ్‌కప్ జట్టులో తనకు అవకాశం రాకపోవడానికి మరో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అద్భుత ఫార్మ్‌ కూడా ఒక ముఖ్య కారణమని ధావన్ అంగీకరించారు. “అప్పుడు గిల్ అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. నేను వన్డేలకే పరిమితుడిని. సెలెక్టర్లు, కోచ్ దృష్టిలో అతడు ముందుంటే, ఎంపిక చేయడంలో తప్పేమీ లేదు” అని చెప్పారు.

అంతేకాదు, 2021 టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో తన పేరు ఉండదని కూడా ముందే ఊహించానని ధావన్ వెల్లడించారు. “నన్ను ఎంపిక చేయరని నాకు తెలుసు. జట్టు ప్రకటించిన తర్వాత నేను ఎవరినీ అడగలేదు. అడిగినా వాళ్ల వాదన వాళ్లు చెబుతారు, నేను నా కథ చెబుతాను – అది ప్రయోజనం ఉండదు” అని అన్నారు.

అయితే, తనను జట్టులో నుంచి తప్పించిన సమయంలో అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వ్యక్తిగతంగా మెసేజ్ చేసి, విషయాన్ని వివరించాడని ధావన్ తెలిపారు.

Read More : Neeraj : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ వన్

One thought on “నా కెరీర్ ముగిసిందని ఆ రోజే తెలిసింది: ధావన్

Comments are closed.