‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు, ‘కూలీ’ ఫేం షౌబిన్ షాహిర్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చీటింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డుల వేడుకకు వెళ్లేందుకు అనుమతి కోరగా, ఎర్నాకులం కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
వివరాల్లోకి వెళితే… సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా అవార్డులకు హాజరయ్యేందుకు షౌబిన్ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగా, కీలక సాక్షి కూడా దుబాయ్‌లోనే ఉన్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. షౌబిన్ విదేశాలకు వెళితే సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించింది.
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాణ వ్యవహారంలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి షౌబిన్ తన తండ్రితో పాటు మరో వ్యక్తితో కలిసి నిర్మాతగా వ్యవహరించారు. సిరాజ్ అనే వ్యక్తి ఈ సినిమా కోసం రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టగా, సినిమా లాభాల్లో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినప్పటికీ తనకు రావాల్సిన వాటా ఇవ్వలేదని సిరాజ్ ఆరోపించారు.
ఈ ఫిర్యాదుతో ఎర్నాకులం పోలీసులు షౌబిన్ సహా ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షౌబిన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నప్పటికీ, తాజా కోర్టు ఆదేశాల కారణంగా ఆయన సైమా అవార్డుల వేడుకకు దూరమయ్యారు.
Read More : మహేశ్ బాబు–రాజమౌళి ‘SSMB 29’ కెన్యా షెడ్యూల్ పూర్తి.
One thought on “షౌబిన్ షాహిర్ దుబాయ్ పర్యటనను కోర్టు అడ్డుపెట్టింది ?”
Comments are closed.