లోనావాలా: సంగీత బిజ్లానీ బంగ్లాలో చోరీ, రూ.57 వేలు నష్టం

భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ భార్య, సినీ నటి సంగీత బిజ్లానీ యాజమాన్యంలో ఉన్న లోనావాలాలోని బంగ్లాలో భారీ చోరీ జరిగింది. పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోనాపేత్ ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లాలో మార్చి 7 నుంచి జూలై 18 మధ్య కాలంలో ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగులు బంగ్లా వెనుక వైర్ మెష్ కంచెను తొలగించి లోపలికి ప్రవేశించారు. అనంతరం మొదటి అంతస్తు గ్యాలరీకి ఎక్కి, కిటికీ గ్రిల్‌ను బలవంతంగా తెరిచి బంగ్లాలోకి చొరబడ్డారు. దొంగలు బంగ్లాలో రూ.50,000 నగదు, రూ.7,000 విలువైన టీవీ సెట్‌ను అపహరించారు. మొత్తంగా రూ.57,000 నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.

ఇంట్లోని సామాగ్రిని కూడా దుండగులు ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఫిర్యాదు చేసినట్టు పోలీసుల కథనం. మార్చి 7 మరియు జూలై 18 మధ్య ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో లోనావాలా గ్రామీణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Read More : సీఐడీ అధికారులు ఉప్పల్ స్టేడియంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్

One thought on “లోనావాలా: సంగీత బిజ్లానీ బంగ్లాలో చోరీ, రూ.57 వేలు నష్టం

Comments are closed.