బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న చోటుచేసుకున్న భయానక తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించింది.
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు RCB యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఇదే సందర్భంలో గాయపడిన వారి వైద్యం, పునరావాస ఖర్చుల కోసం ప్రత్యేకంగా ‘RCB Cares’ పేరిట ఓ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
బాధితుల పట్ల సానుభూతితో స్పందించిన RCB యాజమాన్యం, ఈ దుర్ఘటనను తాము ఎంతో బాధతో స్వీకరిస్తున్నామని, బాధితుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అభిమానులు, సామాన్య ప్రజలకు సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొంది. ఈ చర్యలు బాధిత కుటుంబాలకు కొంత మేర ఊరట కలిగిస్తాయని ఆశ వ్యక్తం చేసింది.

Read More : RCB ర్యాలీలో తొక్కిసలాటపై BCCI స్పందన
