రాజ్కోట్ జిల్లా జస్దాన్ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండో వివాహం చేసుకోవాలనే తన కోరికను కొడుకు వ్యతిరేకించాడన్న కారణంగా ఓ తండ్రి తన కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన ఆదివారం (మార్చి 17) న సంచలనం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 76 ఏళ్ల రామ్ బోరిచా అనే వృద్ధుడు తన ఏకైక కుమారుడు ప్రతాప్ (52)ను అతడి ఇంటిలోనే రెండు రౌండ్లు కాల్చి హత్య చేశాడు. ఘటన జరిగిన వెంటనే బోరిచా తన కుమారుడి మృతదేహం పక్కన ఉన్న కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని పోలీసుల రాకను ఎదురుచూశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని రామ్ బోరిచాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇక బాధితుడు ప్రతాప్ భార్య జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రామ్ బోరిచా భార్య 20 ఏళ్ల క్రితం మరణించిందని, అప్పటి నుంచి రామ్ రెండో వివాహం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారని వెల్లడించారు. అయితే, ప్రతాప్ తండ్రి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో తండ్రి, కొడుకు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుందని తెలిపారు. ఈ వాదనలు చివరకు హత్యకు దారితీశాయి.
ప్రస్తుతం రామ్ బోరిచాపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

One thought on “రాజ్కోట్‌లో దారుణం: రెండో పెళ్లి కోసం కొడుకును కాల్చి చంపిన తండ్రి”
Comments are closed.