కేవలం 22 పరుగుల తేడాతో లార్డ్స్ టెస్టులో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో 170 పరుగులకే పరిమితమైంది. బషీర్ వేసిన ఓవర్లో మహ్మద్ సిరాజ్ ఆడగా.. దురదృష్టవశాత్తూ బంతి వికెట్లను తాకింది. మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నం వృథాగా మారిపోయింది. అయితే, జడ్డూ కాస్త ముందుగానే షాట్లు కొట్టడం ప్రారంభించి ఉంటే బాగుండేదని.. ఆఖరి బ్యాటర్లకు ఫేసింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందని భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా స్పందించాడు. ఒక రకంగా ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా సమాధానం ఇచ్చాడు.
ఇలాంటి పిచ్ పై రవీంద్ర జడేజా వేగంగా పరుగులు చేయలేదు. దానికి కారణం బంతి సాఫ్ట్ గా మారడంతోపాటు పిచ్ మందకొడిగా మారడం. టెయిలెండర్లు ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేసి ఉండి.. టార్గెట్ కు చేరువగా వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకోవాలని జడేజా భావించి ఉంటాడు. ఈ మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చాలా బాగుంది. నాలుగో ఇన్నింగ్స్ లో ఇలాంటి పిచ్ పై పరుగులు చేయడం చాలా కష్టం. మిడ్ ఆఫ్, కవర్స్ మధ్య స్కోరు చేయాలని చూడటం చాలా బాగుంది. గత ఐదేళ్లుగా జడేజా ఆటతీరు మెరుగుపడింది. మరీ ముఖ్యంగా విదేశాల్లో సూపర్. అందుకోసం చాలా కష్టపడ్డాడని పుజారా అన్నారు.
లార్డ్స్ మ్యాచ్ సమయంలోనూ నెట్ ప్రాక్టీస్ చేసిన విషయాన్ని మనం గుర్తించాలన్నారు. పేస్ ను ఎదుర్కొనేటప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. గతంలో అతడు శుభారంభాలను ఇన్నింగ్స్ లుగా మలచడంలో తడబాటుకు గురయ్యేవాడు. అద్భుత నైపుణ్యాలు లేకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 300+ స్కోర్లను చేయలేరు. అలాంటివాటిని అంతర్జాతీయ క్రికెట్లోనూ చేసి చూపించాలి. స్పిన్, సీమ్ బౌలింగ్ ను సమంగా ఎదుర్కొంటున్న తీరు ఇప్పుడు బాగుంది అని పుజారా వెల్లడించాడు. పుజారా, జడేజా సౌరాష్ట్ర తరపున దేశవాళీలో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఆల్ రౌండర్ స్టార్ జడేజా క్రీజ్ లో ఉండి జాగ్రత్తగా ఆడాడు కాబట్టే టీమిండియా ఘోర ఓటమి చవిచూడలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Read More : ఇంగ్లండ్‌లో భారత క్రికెటర్లతో రాజు చార్లెస్ III సమావేశం
