కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి కౌంటర్..

దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘మా జోలికొస్తే తాట తీయడం ఖాయం’’ అంటూ బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను ఉపయోగించి భూములను అక్రమంగా దోచుకున్నారని, ఆ భూములను వారి అనుచరులకు కట్టబెట్టారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను తిరిగి తీసుకునే ప్రభుత్వ చర్యల కారణంగా బీఆర్ఎస్ నేతలు భయంతో గడగడలాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దోచుకున్న అక్రమ సంపదను కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

‘‘బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు మా ప్రభుత్వం భయపడదు. తప్పు చేసిన వారిని క్షమించము, వారిని శిక్షించడమే జరుగుతుంది. ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారడం లేదు’’ అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

అలాగే, ‘‘ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి.. కానీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చలేరు’’ అంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తండ్రీ కొడుకులు పగటి కలలే కంటున్నారని విమర్శించారు.

One thought on “కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి కౌంటర్..

Comments are closed.