సినిమా థియేటర్ల నిర్వహణపై DCM కీలక ఆదేశాలు.

pavan

రాష్ట్రంలో సినిమా థియేటర్ల నిర్వహణలో పారదర్శకత, ప్రజలకు న్యాయం జరిగేలా ఉండాలనే దృష్టితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. సినిమా చూడటానికి వచ్చే ప్రజలకు అనుకూలంగా పరిస్థితులు మారాలంటే, థియేటర్లలో అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ధరలపై నియంత్రణ తప్పనిసరని స్పష్టం చేశారు.

“ప్రజలు థియేటర్లకు రావాలంటే, అక్కడ న్యాయమైన ధరలు ఉండాలి. అధిక ధరల వల్ల ప్రజలు బాధపడకూడదు. వీటిని నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని పవన్ స్పష్టంగా తెలిపారు.

తన సినిమా అయినా సరే, టికెట్ ధరల పెంపు వంటి విషయాల్లో ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా నిర్మాతలు కాకుండా, చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ ఛాంబర్) ద్వారా సంప్రదించాలని సూచించారు. “నా సినిమా ‘హరిహర వీరమల్లు’ అయినా సరే, నిబంధనలు ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఎవరూ మినహాయింపు కాదు,” అని పవన్ పేర్కొన్నారు.

ఇటీవల థియేటర్ల బంద్ ప్రకటన చుట్టూ నెలకొన్న వివాదంపై కూడా ఆయన స్పందించారు. “ఈ బంద్ వెనుక జనసేన నేతలు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎవరిదైనా సంబంధం ఉన్నా, పార్టీని చూస్తే కాదు – తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి,” అని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రజల ఆకాంక్షలు, పరిశ్రమ స్థిరత్వం మధ్య సమతుల్యత కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్న సంకేతాన్ని పవన్ స్పష్టంగా ఇచ్చారు.

Read More : అక్కినేని అఖిల్ పెళ్లి బృందావనం