వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మానవత్వం కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. రాపోలు గ్రామంలో సోమవారం అర్థరాత్రి తల్లి–కొడుకులపై గుర్తుతెలియని దుండగులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గండు నర్సమ్మ (60) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె కుమారుడు రాజేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర వైద్య కేంద్రానికి తరలించారు.
విచారణలో ముగ్గురు అనుమానితులు అదుపులోకి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నర్సమ్మ కుటుంబం రాపోలు గ్రామంలో నివసిస్తోంది. సోమవారం అర్థరాత్రి తల్లి–కొడుకు నిద్రలో ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి రాళ్లు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. నర్సమ్మ తలకు తీవ్రగాయాలు అవడంతో ఆమె ప్రాణాలు కోల్పోగా, రాజేందర్ కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.
పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నర్సమ్మ కుటుంబంతో వారికి వ్యక్తిగత విభేదాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి ఆధారాలతో దోషులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
ప్రస్తుతం రాజేందర్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో గ్రామస్థులు అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read More : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్ నమోదు

One thought on “పరిగిలో దారుణ హత్య:”
Comments are closed.