రక్షణ వ్యయం 18 శాతం పెంపునకు ఆమోదం

భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేందుకు ముందుకొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే నెల ప్రారంభంలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులను 18 శాతం మేర పెంచనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో సోమవారం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావర్ భుట్టో జర్ధారీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో బడ్జెట్ అంశంపై సమావేశమైంది. పీపీపీ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. సమావేశంలో రూ.17.5 ట్రిలియన్ల విలువైన కొత్త బడ్జెట్‌కు రూపకల్పన చేస్తూ, రక్షణ రంగానికి గతంతో పోలిస్తే మరింత కేటాయింపును నిర్ణయించారు.

2024-25లో రక్షణ శాఖకు రూ.2,122 బిలియన్లు కేటాయించగా, 2025-26లో ఈ మొత్తం రూ.2.5 ట్రిలియన్లు దాటనుంది. పాకిస్థాన్ బడ్జెట్‌లో అప్పుల తిరుగుబడి తరువాతి అతిపెద్ద కేటాయింపు ఇదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పుల చెల్లింపులకు రూ.9,700 బిలియన్లు ఖర్చు చేయగా, దానికి తగ్గట్టే రక్షణ వ్యయాన్ని పెంచడం గమనార్హం.

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా.. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రక్షణ ఖర్చులను పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక సంక్షోభం మధ్యలో కూడా సైనిక రంగానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, భారత్‌తో ఉన్న ఉద్రిక్తతలకే ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : “ఆపరేషన్ సిందూర్”తో ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు

One thought on “రక్షణ వ్యయం 18 శాతం పెంపునకు ఆమోదం

Comments are closed.