మీడియా సమావేశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

ఇక మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌కు చేరుకుని త్రివిధ దళాధిపతులతో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్, అలాగే జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా, భారత వైమానిక రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థ, ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత బలగాలు ప్రాణాలు మరియు ఆస్తి నష్టాలు లేకుండా ఈ దాడిని అడ్డుకోవడంలో విజయం సాధించాయి.

దీనికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ భూభాగంలోకి ప్రవేశించి లాహోర్‌లోని పాకిస్థాన్ సైనిక స్థావరాలు, వైమానిక రక్షణ కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. సర్ఘోదా ఎయిర్ బేస్‌ నుంచి బయలుదేరిన ఎఫ్-16, జెఎఫ్-17 థండర్ యుద్ధవిమానాలను భారత బలగాలు కూల్చివేశాయని తెలుస్తోంది.

అలాగే గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ భగ్నం చేసింది. ఈ దాడుల్లో 50కి పైగా డ్రోన్లను భారత సైన్యం నిర్వీర్యం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరగనున్న ఆర్మీ మీడియా సమావేశం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న వ్యూహాలు, విజయాలపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read More : పంజాబ్ ఎయిర్ బేస్‌పై పాక్ మిస్సైల్ దాడి యత్నం.

One thought on “మీడియా సమావేశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.

Comments are closed.