ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే, శనివారం రాత్రి పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆయన నివాసంలోనే పరీక్షలు నిర్వహించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో, పట్నాయక్ డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించారు. ఆయన చికిత్సకు పూర్తి సహకారం అందిస్తున్నారని, నిపుణుల బృందం నిరంతరం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా వయసు కారణంగా పట్నాయక్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న ఆయన, ఇటీవల ముంబైలో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ జరిగిన కొద్దికాలంలోనే మళ్లీ అస్వస్థతకు గురికావడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్పందిస్తూ, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, వరుసగా ఐదు సార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్, 24 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించి చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Read More : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం

One thought on “ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు”
Comments are closed.