ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో ఆర్థిక రాజధాని ముంచెత్తిపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించగా, భారత వాతావరణ శాఖ (IMD) ముంబై నగరానికి, పరిసర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ పరిస్థితుల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ, బీఎంసీ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని సూచించింది. అలాగే నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. రవాణా వ్యవస్థపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. సెంట్రల్ రైల్వే లైన్‌లో రైళ్లు 20-30 నిమిషాల ఆలస్యంగా నడుస్తుండగా, ముంబై విమానాశ్రయం కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయి. 155 బయలుదేరే విమానాలు, 102 రాబోయే విమానాలు ఆలస్యమైనట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా ప్రయాణాల్లో అంతరాయం కలుగుతోందని ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంధేరి వెస్ట్‌లోని ఎస్వీ రోడ్డులో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సియాన్‌లోని గాంధీ మార్కెట్, దాదర్ టీటీ, ముంబై సెంట్రల్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వసాయి మితాఘర్ ప్రాంతంలో దాదాపు 200-400 మంది వరద నీటిలో చిక్కుకున్నట్లు సమాచారం.
గత 24 గంటల్లో విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బైకుల్లాలో 241.0 మి.మీ., శాంతాక్రూజ్‌లో 238.2 మి.మీ. వర్షం కురిసింది.
Read More : ఎరువుల సరఫరాకు చైనా అంగీకారం

One thought on “ముంబైలో కుండపోత వర్షాలు: రెడ్ అలర్ట్”
Comments are closed.