లోకేంద్రతోమర్‌పై సిట్ ఫోకస్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక మలుపు తిరిగింది. భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీ తన అనుచరులతో కలిసి ఇండోర్‌లోని హీరాబాగ్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్‌పై మేఘాలయ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శ్రద్ధ సారించింది.

సిట్‌కు అందిన సమాచారం ప్రకారం, సోనమ్ ఆ ఫ్లాట్‌ను విడిచిపెట్టే సమయంలో ఒక బ్యాగ్‌ను అక్కడే వదిలి వెళ్లింది. అందులో నాటు తుపాకీ, రాజాకు చెందిన నగలు, రూ. 5 లక్షల నగదు, సోనమ్ మొబైల్ ఫోన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఆ బ్యాగ్‌ను ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్ తీసుకెళ్లాడని సిట్ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రాపర్టీ డీలర్ సిలోమ్ జేమ్స్‌ను విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చిన సిలోమ్ జేమ్స్, సోనమ్ లొంగిపోయిన అనంతరం లోకేంద్ర తనను కాల్ చేసి “ఆ బ్యాగ్‌ను వెంటనే తీసేయండి” అని చెప్పినట్లు పోలీసులకు వెల్లడించాడు. తాను తిరస్కరించడంతో లోకేంద్ర స్వయంగా వచ్చి బ్యాగ్‌ను తీసుకెళ్లాడని తెలిపాడు. అంతేకాదు, తన ఫ్లాట్ సమీపంలోని కారు షోరూమ్ సీసీటీవీ ఫుటేజీను సేకరించేందుకు తోమర్ ప్రయత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం లోకేంద్ర తోమర్ పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ కూడా స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

Read More : బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణికుడిపై దాడి