మీరట్ జిల్లా భూని టోల్ ప్లాజా వద్ద సైనికుడిపై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) కఠినంగా స్పందించింది. ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ టోల్ ప్లాజా నిర్వాహక ఏజెన్సీపై రూ.20 లక్షల భారీ జరిమానా విధించినట్టు నిన్న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జరిమానాతో పాటు, ఆ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. అంతేకాక భవిష్యత్తులో టోల్ ప్లాజా టెండర్లలో పాల్గొనే హక్కును రద్దు చేసే చర్యలు కూడా చేపడుతున్నట్లు తెలిపింది. సిబ్బంది క్రమశిక్షణను నిలబెట్టడంలో విఫలమవడం, ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆ సంస్థ తేల్చింది.
ఈ నెల 17న మీరట్–కర్నాల్ జాతీయ రహదారి 709ఏపై ఉన్న భూని టోల్ ప్లాజా వద్ద ఘటన చోటుచేసుకుంది. గోట్కా గ్రామానికి చెందిన సైనికుడు కపిల్ సెలవులు ముగించుకుని విధులకు వెళ్తుండగా టోల్ సిబ్బందితో వాగ్వివాదం జరిగింది. మాటామాటా పెరగడంతో సైనికుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం విషయంలో ఎన్‌హెచ్ఏఐ ఎప్పటికీ రాజీపడదని, టోల్ సిబ్బంది హింసాత్మక ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
Read More : సతారాలో మద్యం మత్తులో ఆటో డ్రైవర్ దౌర్జన్యం !

One thought on “మీరట్ టోల్ ప్లాజా ఘటనపై ఎన్‌హెచ్ఏఐ సీరియస్”
Comments are closed.