వెండితెరపై దాదాపు తొమ్మిదేళ్ల విరామానంతరం నటుడు మంచు మనోజ్ బలంగా తిరిగి రానున్నారు. తన తాజా చిత్రం “భైరవం“తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ఓ మీడియా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, సినిమాలపై ఉన్న ప్రేమను బహిరంగంగా వెల్లడించారు.
నటనకు మళ్లీ ప్రాణం పెట్టిన మనోజ్
“తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా, జనాలకి మాత్రం దగ్గరగానే ఉన్నాను. ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను. కొంతకాలం వ్యక్తిగత కారణాల వల్ల వెనక్కి వచ్చా. దేవుడి దయవల్ల ఇప్పుడు మంచి కథలతో తిరిగి వచ్చాను,” అని అన్నారు.
తన కొత్త సినిమా ‘భైరవం’ గురించి మాట్లాడుతూ, “ఈ కథ దర్శకుడు విజయ్ కనకమేడల నావద్ద చెప్పగానే నచ్చింది. ఒరిజినల్ తమిళ వెర్షన్ కూడా చూడలేదు. ఆయనపై నాకున్న నమ్మకమే కారణం,” అన్నారు. ఈ సినిమాలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటిస్తుండటంతో ప్రత్యేక ఆనందం వ్యక్తం చేశారు.
కుటుంబ విషాదం – గుండె పగిలిన మనోజ్
తన సోదరుడు మంచు విష్ణుతో ఉన్న విభేదాలు, తండ్రి మోహన్ బాబుతో ఉన్న అనుబంధంపై మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో నాన్నగారి దగ్గరకు షిఫ్ట్ అయ్యాం. అది కొందరికి నచ్చలేదు. మా మీద కేసులు పెట్టించటం జరిగింది. నన్ను కాదు, నా భార్యను టార్గెట్ చేశారు. ఇది నా గుండెను పగలగొట్టింది,” అన్నారు.
తండ్రి గురించి మాట్లాడుతూ, “నాన్న కాళ్లు పట్టుకోవాలని ఉంది. నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఉంది. కానీ నాన్న నేర్పిన న్యాయం, నిజాయితీ వల్లే నేనిప్పుడు వెనకడుగు వేయలేకపోతున్నా,” అన్నారు. తన కుటుంబం మళ్లీ కలిసిపోవాలని ఆకాంక్షించారు.
విష్ణుతో వివాదం – చర్చలకు సిద్ధమే!
విష్ణు ఇటీవల చేసిన “రక్తం పంచుకున్నవాళ్లే పతనాన్ని కోరుకుంటున్నారు” అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ, మనోజ్, “కూర్చుని మాట్లాడదామని ఎన్నోసార్లు ప్రయత్నించా. ఎవరు దూరమవుతున్నారో అందరికీ తెలుసు. చర్చలకు నేను ఎప్పుడూ సిద్ధమే,” అన్నారు.
భవిష్యత్ ప్రణాళికలు
భైరవం తర్వాత ‘మిరాయి’ అనే కొత్త చిత్రంలో నటించనున్నట్టు తెలిపారు. “డబ్బు సంపాదించడానికంటే, సంతోషంగా పనిచేయడమే ముఖ్యం. గతంలో ప్రొడ్యూసర్ల కోసం లాభం వదిలేశాను. ఇప్పటికీ మంచి సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం,” అని చెప్పారు.
తనపై నమ్మకముంచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, “ఈసారి ఆశించినంత గొప్పగా తిరిగివస్తాను” అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
Read More : “కన్నడ రాని వారికి స్థానం ఎందుకు?”

One thought on “మనోజ్ భావోద్వేగ ఇంటర్వ్యూ”
Comments are closed.