డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. పాలన పరంగా తెలంగాణను బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని, కేసీఆర్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ అంశంపై కాంగ్రెస్ వాస్తవాలు చెబితే, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, అందుకే కేసీఆర్ తన రెండో కేబినెట్‌లో హరీశ్ రావుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలనను, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రుణమాఫీ అమలు చేశామని, కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద అందించామని గుర్తుచేశారు. దేశంలోనే రైతుల కోసం ఇంత పెద్ద స్థాయిలో సహాయం చేసిన రాష్ట్రం తెలంగాణలోనేనని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులు తెచ్చామని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఆటంకం కలిగించిందని ఆరోపించారు.
అదేవిధంగా ఎల్లంపల్లి, నెట్టెంపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తు చేశారు.
Read More : ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య