మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఒక కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలి తల్లిదండ్రులు తమ కొడుకు, ఇద్దరు కూతుర్లతో కలిసి జడ్చర్లలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం తండ్రి పని నిమిత్తం బయటకు వెళ్లగా, తల్లి అనారోగ్యంతో ఉన్న పెద్ద కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే అదనుగా భావించిన నలుగురు 4, 5 తరగతులు చదువుతున్న బాలురు, వారితో పాటు ఇంటర్ చదువుతున్న ఒక 16 ఏళ్ల సమీప బంధువు బాలిక ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన జరిగినప్పటి నుండి బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో, బుధవారం తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో దిగ్భ్రాంతి చెందిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లపై పోక్సో (POCSO) చట్టం కింద మరియు గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : తిరుపతిలో అధికారిపై తీవ్ర ఆరోపణలు
