NDSA నివేదికపై L&T సంచలన లేఖ.

మేడిగడ్డ బ్యారేజ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) విడుదల చేసిన నివేదికపై ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్&టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తగిన సాంకేతిక పరీక్షలు చేయకుండా నివేదిక ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ఎన్‌డీఎస్ఏకు లేఖ రాసింది.

ఎన్‌డీఎస్ఏ నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యానికి కారణాలు తెలుసుకోవాలంటే సంబంధిత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం అవసరం అని తాము స్పష్టంగా సూచించామని ఎల్&టీ గుర్తు చేసింది. అయితే, గ్రౌటింగ్ కారణంగా ఆ పరీక్షలు చేయలేకపోయామని ఎన్‌డీఎస్ఏనే నివేదికలో పేర్కొనడంతో పరీక్షలు చేయకుండానే నివేదిక ఎలా సిద్ధం చేసారని ఎల్&టీ నిలదీసింది.

ఇంకా, నివేదికలోని పేజీ 283లో క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించిన వివరాలను ఎల్&టీ సమర్పించిందని పేర్కొంటూనే, పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రకటించారంటూ ప్రశ్నలు గుప్పించింది.

పూర్వంలోనే మేడిగడ్డ పునరుద్ధరణపై ఎన్‌డీఎస్ఏతో పాటు నీటిపారుదల శాఖను కూడా ఎల్&టీ అప్రమత్తం చేసినట్టు లేఖలో పేర్కొంది. పరీక్షలు లేకుండా వైఫల్యంపై అభిప్రాయాలు ప్రకటించడం సరైంది కాదని, ఇలా తయారైన నివేదిక పాక్షికంగానే మిగులుతుందన్న అభిప్రాయాన్ని తెలిపింది.

ఈ లేఖతో మేడిగడ్డపై వివాదం మళ్లీ ముదురనుందన్న అంచనాలు రాజకీయ, పాలనాపర వర్గాల్లో మొదలయ్యాయి.

Read More : ఫార్ములా ఈ కేసు విచారణకు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.