కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లోకేశ్ విజ్ఞప్తి

రాయలసీమను పండ్లతోటల అభివృద్ధికి కేంద్రంగా మార్చే దిశగా కేంద్ర సహకారం అవసరమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను ఆయన న్యూఢిల్లీలో కలిశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… ‘‘రాయలసీమలో మామిడి, అరటి, బత్తాయి, దానిమ్మ, టమోటా, డేట్స్ వంటి పంటలను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. అయితే, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలు పడుతున్నారు. ‘యువగళం’ పాదయాత్ర సమయంలో వారి సమస్యలను నేరుగా చూశాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటేనే వారికి మెరుగైన ఆదాయం లభిస్తుంది’’ అని వివరించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేయగా, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సానుకూలంగా స్పందించారు. రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

తిరుపతి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జులై 11, 12 తేదీల్లో ఏపీ పర్యటనకు వస్తున్నట్లు చిరాగ్ వెల్లడించారు. లోకేశ్‌ను కూడా ఆ పర్యటనకు ఆహ్వానించిన ఆయన… క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించేందుకు కలిసి పని చేద్దామని అన్నారు.

ఈ సందర్భంగా యువగళం అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని లోకేశ్ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బహూకరించారు. మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.

Read More : జగన్ పర్యటనలో విషాదం: ఒకరు మృతి

One thought on “కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లోకేశ్ విజ్ఞప్తి

Comments are closed.