ఇటీవల స్టాండప్ కమెడియన్లపై వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే రణవీర్ అలహాబాద్యా, సమయ్ రైనా వంటి కమెడియన్లపై కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు కునాల్ కమ్రా కూడా చట్ట సమస్యల్లో చిక్కుకున్నాడు. ఇటీవల నిర్వహించిన ఓ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బుక్ మై షో సంస్థ సంచలన నిర్ణయం తీసుకొని కునాల్ కమ్రా షోలపై నిషేధం విధించింది.
కునాల్ కమ్రా నిర్వహించిన ఆ షోలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్‌లపై చేసిన సెటైర్లు తీవ్రంగా విమర్శల పాలయ్యాయి. షో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది రెండు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఈ వీడియోపై శివసేన (షిండే వర్గం) ఆగ్రహంతో స్పందించి, ముంబైలో ప్రదర్శన జరిగిన హాబిట్ ఆడిటోరియంలో ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముంబై పోలీసులు కునాల్‌కు మూడు సమన్లు జారీ చేశారు. తీరా, కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందాడు.
శివసేన యువజన విభాగ నాయకుడు రాహుల్ కనాల్, బుక్ మై షో సంస్థకు లేఖ రాసి కమ్రా భవిష్యత్ ప్రదర్శనలకు టిక్కెట్లు అమ్మవద్దని కోరారు. దీనికి స్పందించిన సంస్థ, తన వెబ్‌సైట్ నుండి కునాల్ కమ్రాకు సంబంధించిన సమాచారం తొలగించింది. అలాగే ఇకపై ఆయన షోలకు టిక్కెట్లు విక్రయించబోమని స్పష్టంగా వెల్లడించింది. గతంలో అర్నబ్ గోస్వామిపై విమాన ప్రయాణ సమయంలో చేసిన వ్యాఖ్యల వల్ల కూడా కమ్రా విమానయాన సంస్థల నిషేధానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో బుక్ మై షో తీసుకున్న తాజా నిర్ణయం మరో పెద్ద దెబ్బగా మారింది.

One thought on “స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బుక్ మై షో షాక్”
Comments are closed.