హైదరాబాద్ చెత్త సమస్యపై కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాలు మురుగు నీరు, చెత్త కుప్పలతో దయనీయ స్థితిలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు విస్తరిస్తూ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో వర్షాకాలానికి ముందే సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకునేవారని, మున్సిపల్ శాఖ, జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు కలసి సమన్వయ సమావేశాలు నిర్వహించేవని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లలో మునిగిపోయారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలు ప్రజలను అల్లాడిస్తున్నాయని, ఆయన ప్రసంగాల్లో ఎప్పుడూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును తప్పక ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రానికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించిన కేటీఆర్, ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి బలమైన స్థానం సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More : తెలంగాణలో భారీ వర్షాలు, రహదారులు జలమయం