హైదరాబాద్‌లో ఓపెన్ ఏఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి

ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని ఆయన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌కు బహిరంగ విజ్ఞప్తి చేశారు.

వచ్చే నెలలో శామ్ ఆల్ట్‌మన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం విశేషంగా పెరుగుతోందని, గత ఏడాదితో పోలిస్తే చాట్‌జీపీటీ వాడకం నాలుగు రెట్లు అధికమైందని ఆయన ఇటీవల ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆ పోస్ట్‌కు స్పందించిన కేటీఆర్, హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

భారత్‌లో అడుగుపెట్టనున్న ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థలకు హైదరాబాద్ సరైన గమ్యస్థలమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యుత్తమ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ హైదరాబాద్‌లో ఉందని గుర్తుచేశారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) వంటి అగ్రశ్రేణి వేదికలు ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు దోహదం చేస్తాయని వివరించారు.

ఇప్పటికే ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో కార్యాలయం ప్రారంభిస్తామని ఓపెన్ ఏఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఆహ్వానం తర్వాత సంస్థ తన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తుందనే అంశంపై ఆసక్తి పెరిగింది.

Read More : దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు.

One thought on “హైదరాబాద్‌లో ఓపెన్ ఏఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి

Comments are closed.