కేటీఆర్‌కు మద్దతుగా కవిత.. కాంగ్రెస్‌పై గరంగరంగా విమర్శలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన సోదరి, పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గట్టి మద్దతు ఇచ్చారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విచారణ చేస్తున్నారని, ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.

“ఏ పార్టీలోనైనా లోపాలు ఉంటాయి. వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లడం సహజం. అందుకోసం దానిని పెద్ద సమస్యగా చూపించాల్సిన అవసరం లేదు. మేమే మా లోపాలను సరిదిద్దుకుంటాం. కానీ మాపై దాడి చేస్తే మేం ఊరుకోము” అని కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలను అడ్డుకోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొసలి కన్నీళ్లు కారుస్తోందని కవిత మండిపడ్డారు. ఇప్పటివరకు కేవలం ఒకసారి, అదీ 60 శాతం రైతులకే రైతు భరోసా అందించిందని అన్నారు. మిగతా 40 శాతం రైతులకు ఎప్పుడు అందిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత యాసంగిలో మూడు ఎకరాల లోపు భూమి ఉన్నవారికే ఇచ్చిన విధానాన్ని కొనసాగిస్తారా లేక అందరికీ వర్తింపజేస్తారా అనే అంశంపై ప్రభుత్వం తేల్చి చెప్పాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు.

Read More : రేవంత్ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది

One thought on “కేటీఆర్‌కు మద్దతుగా కవిత.. కాంగ్రెస్‌పై గరంగరంగా విమర్శలు

Comments are closed.