నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో రూ.41 కోట్లతో చేపట్టిన 339 అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు వివరించారు.
సోమవారం సీఎం నివాసం వద్ద చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. మే 15వ తేదీన ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభినందించారు.
భేటీ అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి.. మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రూరల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అందించారు. అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా కోటంరెడ్డిని మంత్రి లోకేష్ ప్రశంసించారు. కేవలం 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం గర్వకారణమని అన్నారు.
15న ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు అన్ని పనులకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేసి, తర్వాత మిగిలిన పనులను ప్రారంభించామని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పాల్గొననున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెల్లూరు రూరల్‌లోనే రూ.231 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. రాబోయే రోజుల్లో కొండాయపాలెం, భక్తవత్సల నగర్ ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జిల పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దేశంలోనే అనూహ్య అభివృద్ధికి చిరునామా
ఒకే నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులను ఒకే రోజు ప్రారంభించడం దేశంలోనే అరుదైన విషయమని, ఈ అభివృద్ధి ప్రజలకు అంకితం చేస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు. అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు చేరవేయడానికి ప్రత్యేకంగా బుక్‌లెట్ రూపొందించినట్లు తెలిపారు.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని స్పష్టం చేశారు.
Read More : హిందూపురం టీడీపీ గడ్డ..
