పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ ప్రముఖ లా కళాశాలలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ 24ఏళ్ల లా విద్యార్థిని తన కళాశాల ప్రాంగణంలోనే అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగానికి చెందిన నేత మనోజిత్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు యువకులు పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు పోలీసులకు అందించిన వివరాల ప్రకారం, టీఎంసీపీ జనరల్ సెక్రటరీగా ఉన్న మనోజిత్ మిశ్రా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. తిరస్కరించడంతో తనపై వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. జూన్ 25న పరీక్ష ఫారాలు నింపేందుకు కళాశాలకు వచ్చిన తనను ప్రాంగణంలోనే బంధించి, గార్డు గదిలోకి లాక్కెళ్లి, ఇద్దరి సమక్షంలో అత్యాచారం చేశాడని వెల్లడించింది. తన ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకున్నప్పటికీ ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చూపారని వివరించింది. తర్వాత, నిందితులు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా హాకీ స్టిక్‌తో బెదిరించారని పేర్కొంది. ఈ ఘటన 7:30 నుంచి రాత్రి 10:50 గంటల వరకూ కొనసాగిందని తెలిపింది. చివరికి తీవ్ర హెచ్చరికలతో బయటకు పంపారన్న ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాతో పాటు మరో ఇద్దరైన జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)లను అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీకి తరలించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. నిందితుడు టీఎంసీకి చెందిన వ్యక్తి కావడం, అతడికి ఆ పార్టీ అగ్రనేతలతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఫోటోలు బయటపెట్టారు. దీనిపై టీఎంసీ స్పందిస్తూ, నిందితుడికి పార్టీతో సంబంధం నిజమే అయినప్పటికీ, అతన్ని చట్టబద్ధంగా శిక్షించాలని, న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కళాశాల ప్రాంగణంలోనే ఒక విద్యార్థిని భద్రత లేని పరిస్థితులు ఉండటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బాధితురాలికి న్యాయం జరగాలని ప్రజలు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : వర్చువల్ కోర్టు విచారణలో అపహాస్యం

One thought on “పశ్చిమ బెంగాల్‌లో లా విద్యార్థిని పై అత్యాచారం కేసు.”
Comments are closed.