టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో కొలికపూడి వైసీపీలో చేరతారా? అన్న అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొలికపూడి స్పష్టీకరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణించానని, అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ఉన్నారని తెలిపారు. “మర్యాదపూర్వకంగా పలకరించాను.. ఆయన కూడా బాగున్నానని సమాధానమిచ్చారు. అంతే జరిగింది” అని కొలికపూడి వివరణ ఇచ్చారు.
తాను తిరుపతిలో ఉన్న సమయంలో సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వెంటనే అమరావతి వెళ్లానని, నిన్న, ఇవాళ తిరువూరులోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపారు. రాజమండ్రిలో పెద్దిరెడ్డిని కలిసినట్టుగా చేస్తున్న దుష్ప్రచారం అసత్యమని కొలికపూడి ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వీడియో ఆధారంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ, “బొత్స, అయ్యన్నపాత్రుడు వాటేసుకుని మాట్లాడుకున్న వీడియో బయటకు వచ్చినా ఎవరూ మాట్లాడరు. కానీ నా విషయంలో ఇష్టంవచ్చినట్లు ఆరోపిస్తున్నారు” అని మండిపడ్డారు. ఎన్ని వదంతులు వ్యాప్తి చేసినా తిరువూరు ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
Read More : జైలులో మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి
