కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు

హత్య కేసులో దోషిగా తేలిన కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దయిందన్న వార్తలు బయటకు రావడంతో సంచలనం చెలరేగింది. అయితే, ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. “నిమిష ప్రియ కేసుపై కొందరు వ్యక్తులు పంచుకుంటున్న సమాచారం పూర్తిగా తప్పు” అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇక, ఇండియా గ్రాండ్ ముఫ్తీ కంథాపురం ఏపీ అబూబక్కర్ ముస్లియార్ కార్యాలయం మాత్రం వేరే వాదన చేసింది. “నిమిష ప్రియ మరణశిక్ష ఇంతకుముందు తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఇప్పుడు పూర్తిగా రద్దు అయింది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు” అని ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ విషయంపై యెమెన్ ప్రభుత్వంనుంచి రాతపూర్వక నిర్ధారణ ఇంకా అందలేదని ఆ కార్యాలయం పేర్కొంది. బాధితుడి కుటుంబం నుంచి పూర్తి ఏకాభిప్రాయం రాకపోవడమే అధికారిక ప్రకటన ఆలస్యం కావడానికి కారణమని తెలుస్తోంది.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నిమిష ప్రియ మెరుగైన ఉపాధి కోసం 2008లో యెమెన్‌కు వెళ్లారు. అక్కడ సొంత క్లినిక్ ప్రారంభించేందుకు స్థానిక వ్యాపారవేత్త తలాల్ అబ్దో మహ్దీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. అయితే, కాలక్రమేణా ఈ భాగస్వామ్యం వివాదాస్పదమైందని, మహ్దీ తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, దారుణంగా హింసించాడని, క్లినిక్ ఆదాయాన్ని దుర్వినియోగం చేశాడని నిమిష ఆరోపించారు.

2017లో తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందేందుకు నిమిష ప్రియ మహ్దీకి సెడేటివ్ ఇంజెక్ట్ చేశారు. అయితే, ఈ ప్రయత్నం దురదృష్టవశాత్తు మహ్దీ మరణానికి దారితీసింది. అనంతరం ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 2018లో అరెస్టైన నిమిష, 2020లో సనా ట్రయల్ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది.

ఈ ఏడాది జూలై 16న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, భారత ప్రభుత్వ జోక్యం, గ్రాండ్ ముఫ్తీ ముస్లియార్ విజ్ఞప్తితో శిక్ష తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా, ఈ శిక్ష పూర్తిగా రద్దయిందని వార్తలు వచ్చినప్పటికీ, వాటిని భారత ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం నిమిష ప్రియ జీవిత ఖైదు లేదా బాధితుడి కుటుంబానికి “బ్లడ్ మనీ” చెల్లింపు ద్వారా విడుదల అయ్యే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Read More : మేఘాలయలో 4 వేల టన్నుల బొగ్గు మాయం

One thought on “కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు

Comments are closed.