కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న KCR

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై కొనసాగుతున్న విచారణలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకావాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూన్ 5న ఆయన కమిషన్ విచారణకు హాజరుకానున్నారు.

ఈ మేరకు కేసీఆర్ ఇటీవల రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. కమిషన్ విచారణకు హాజరైన సమయంలో ఏవిధంగా సమాధానాలు ఇవ్వాలో, ప్రశ్నలకు మౌఖికంగానా, లేక లిఖితపూర్వకంగానా స్పందించాలో ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.

ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ 100 మందికి పైగా అధికారులను విచారించింది. వారిలో పలువురు, అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకే పనులు జరిగాయన్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. హరీశ్ రావు జూన్ 9న విచారణకు హాజరవుతానని ప్రకటించగా, కేసీఆర్ హాజరు నిర్ణయం ఇప్పుడు అధికారికంగా స్పష్టమవుతోంది.

కేసీఆర్ ప్రస్తుతం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దెబ్బతినడానికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. విజిలెన్స్ నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు, నిర్మాణ సంస్థల సమాధానాలు వంటి అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలు కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణను మరో దశకు తీసుకెళ్లనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : SLBC టన్నెల్ తవ్వకంపై సాంకేతిక కమిటీ కీలక సూచనలు.

One thought on “కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న KCR

Comments are closed.