కడప జిల్లాలో టీడీపీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా మహానాడు నిర్వహించడం చారిత్రక ఘట్టమని, ఈ విజయానికి కారణమైన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు. మహానాడు ముగింపు రోజు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
“ఇది జగన్ అడ్డా కాదు – ఇకపై చంద్రబాబు గారి అడ్డా”
కొన్ని మీడియా సంస్థలు “జగన్ ఇలాకాలో మహానాడు” అంటూ రాస్తున్నాయని పేర్కొన్న బీటెక్ రవి, “2024లో పది అసెంబ్లీ సీట్లలో ఏడు టీడీపీ ఖాతాలోకి వచ్చాయి. ఇక ఇది చంద్రబాబు గారి అడ్డా” అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టుల కృషి చంద్రబాబుదే
తమిళనాడు ప్రభుత్వ సహకారంతో తెలుగుగంగ ప్రాజెక్టును నందమూరి తారక రామారావు గారు పూర్తి చేశారని, అదే తరహాలో గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను చంద్రబాబు గారు వేగవంతం చేశారని గుర్తు చేశారు. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో, పులివెందుల ప్రాంతానికి నీరు అందించారని కొనియాడారు.
పులివెందుల హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి
పులివెందులలో పండే అరటి, బత్తాయి పంటలు దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జీవన్, అమృత్ పథకాల ద్వారా పులివెందుల మున్సిపాలిటీలో తాగునీరు అందించిందీ చంద్రబాబు పాలనలోనే అంటూ ప్రశంసించారు.
జగన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు
జగన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యపై స్పందించకుండా, కేసుల పరిష్కారం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. “గత ఐదేళ్లలో కడపకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. జూన్ 10న కడప స్టీల్ ప్లాంట్ పనులను చంద్రబాబు ప్రారంభించబోతున్నారు,” అని వెల్లడించారు.
“వైఎస్ఆర్ హయాంలో ఐపీఎస్‌లు జైలు పాలయ్యారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి”
ప్రతిపక్ష నేత ఎప్పుడు బయట ఉంటారో, ఎప్పుడు జైల్లోకి వెళతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. గతంలో జరిగిన పరిటాల రవి, సూరి, గాలి కేసులను గుర్తు చేస్తూ, వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, లిక్కర్ కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం తథ్యమని వ్యాఖ్యానించారు.
Read More : మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే అస్వస్థత
