యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో షాకింగ్ వాస్తవం వెలుగు


పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. భారత అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆమెను వినియోగించినట్లు తాజా సమాచారం వెల్లడైంది.

ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం, జ్యోతి ఐఎస్‌ఐకి చెందిన హ్యాండ్లర్ అలీ హసన్తో కోడ్ భాషలో సంభాషణలు జరిపిందని తెలిసింది. వీరిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్లేషించగా, భారత గూఢచార వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారం కోడ్ భాషలో చర్చించినట్లు గుర్తించారు.

కోడ్ భాషలో సంభాషణలు ఇలా:

హసన్: నువ్వు అటారీ వద్ద ఉన్నప్పుడు ఎవరికైనా ప్రత్యేక ప్రోటోకాల్ కనిపించిందా?

జ్యోతి: లేదు, ఎవరికీ ప్రత్యేక ప్రోటోకాల్ కనిపించలేదు.

హసన్: అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించాలంటే అదే సరైన మార్గం. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు.

జ్యోతి: వాళ్లు అంత తెలివి తక్కువ వాళ్లు కాదు.

ఈ సంభాషణల ఆధారంగా జ్యోతి భారత అండర్‌కవర్ మిషన్లకు సంబంధించి కీలక సమాచారాన్ని పాక్ ఐఎస్‌ఐకి అందజేస్తూ ఉండవచ్చని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ చాటింగ్‌ను డీక్రిప్ట్ చేసిన అధికారులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

2023లో పాకిస్థాన్ పర్యటన ద్వారా పరిచయాలు?

వైశాఖి పండుగ సందర్భంగా 2023లో జ్యోతి తొలిసారి పాకిస్థాన్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. తొలుత డానిష్‌ గురించి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జ్యోతి, అనంతరం తార్కికం లేని సమాధానాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం జ్యోతిని ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. ఆమె ఉద్దేశపూర్వకంగా గూఢచర్యానికి పాల్పడిందా? లేక ఎవరైనా మోసం చేసి, తెలియకుండానే ఈ చట్రంలోకి లాగారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు దేశ భద్రతకు సంబంధించి తీవ్ర స్పందనను కలిగిస్తోంది. త్వరలో మరిన్ని విషయాలు వెలుగు చూడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Read More : కేరళలో 95 యాక్టివ్ కరోనా కేసులు

One thought on “యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో షాకింగ్ వాస్తవం వెలుగు

Comments are closed.