గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరోగా, శివరాజ్ కుమార్, ఎస్. ఎస్. రాజమౌళి తదితర ప్రముఖులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సినిమా, చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘జూనియర్’. మంచి అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకొందా ఈ రివ్యూలో చూసేద్దాం.
కథ ఏంటో చూస్తే…
జ్ఞాపకాలే ముఖ్యం అనుకునే కుర్రాడు అభి (కిరీటి). ‘అరవయ్యేళ్లొచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా’ అనేది అభి సిద్ధాంతం. కాలేజ్ లో నాలుగేళ్ల జీవితాన్ని స్నేహితులతో కలిసి సరదా సరదాగా గడుపుతాడు. చిన్నప్పట్నుంచి తాను కోల్పోయిన జీవితాన్ని, జ్ఞాపకాల్ని పోగు చేసుకుంటాడు. ఆ తర్వాత తాను మనసుపడిన స్ఫూర్తి (శ్రీలీల) పనిచేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. కానీ, అక్కడ బాస్ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే అస్సలు పడదు. ఆమెకు తన పేరుతోనే ఉన్న విజయనగరం అనే ఊరంటే కూడా అస్సలు నచ్చదు. అలాంటి ఇష్టం లేని ఊరికి, ఇష్టం లేని ఉద్యోగి అయిన అభితో కలిసి వెళ్లాల్సి వస్తుంది. అదెందుకు? అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఆ ఊరికీ, విజయ సౌజన్యకీ మధ్య సంబంధం ఏమిటి? ఆమెకీ, ఆ ఊరికి చెందిన కోదండపాణి (రవిచంద్రన్)కీ మధ్య సంబంధం ఏమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మొదటి సినిమా అనగానే… హీరో డ్యాన్సులు బాగా చేశాడా? ఫైట్లు ఎలా ఉన్నాయి? పాత్రలో ఎంత హుషారుగా కనిపించాడు? హీరోయిజం ఎలా ప్రదర్శించాడనే విషయాల్ని ఎక్కువగా ఆరా తీస్తుంటారు. అందుకే సినీతారల వారసులు, ప్రముఖ కుటుంబాల నుంచి వచ్చే కథానాయకులు వాళ్ల ప్రతిభని పూర్తిగా ఆవిష్కరించే ఓ షో రీల్ తరహా సినిమాల్ని సిద్ధం చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ‘జూనియర్’ కూడా ఆ లెక్కల ప్రకారమే రూపొందింది. హీరో తండ్రి ప్లాష్ బ్యాక్ తో సినిమా ఆరంభమైనా… ఫస్ట్ హాఫ్ దాదాపుగా హీరో చేసే రకరకాల విన్యాసాలతోనే సాగుతుంది. పార్కర్ ఫైటింగ్ తో హీరో పరిచయం కావడం, ఆ తర్వాత హుషారైన డ్యాన్స్ తో కూడిన పాట, తన గ్యాంగ్ తోనూ, హీరోయిన్ తోనూ కలిసి చేసే అల్లరి సన్నివేశాలు… ఇలా ఫస్టాఫ్ మొత్తం సాగుతుంది. కామెడీ పండటం కలిసొచ్చింది. జెనీలియా పాత్ర పరిచయం నుంచి కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అక్కడ్నుంచి కుటుంబం, అనుబంధాలు, గ్రామీణ నేపథ్యం… ఇలా ప్రేక్షకుడు ఊహించనంత దూరం ప్రయాణం చేస్తుంది. అయితే ఎక్కడా కొత్తగా అనిపించదు. తెలిసిన ఈ కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కనిపించలేదు. హీరోకీ, జెనీలియాకీ మధ్య సంబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి.
ఇక అక్కడ్నుంచి ఆ ఇద్దరి మధ్య డ్రామా మొదలవుతుందని ఆశిస్తాం. కానీ, ఫ్లాష్ బ్యాక్ తర్వాత అనూహ్యంగా మళ్లీ కథ పల్లెటూరి బాట పడుతుంది. ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ తదితర సినిమాల్ని గుర్తు చేస్తూ సీన్స్ సాగుతాయి. సెకండాఫ్ లో ఎమోషన్స్ ని బలంగా పండించేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. దాంతో కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రభావం చూపించాయి. కీలక సన్నివేశాలకి ముందు వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. హీరో టాలెంట్ ని తెరపై ఆవిష్కరిస్తూ, ఓ పెద్ద కథని చెప్పే ప్రయత్నం మాత్రమే చేశారు తప్ప, కొత్తగా చెప్పలేకపోయారు.
ఇక ఎవరెలా చేశారంటే..
కిరీటి హుషారైన తన నటనతో ఆకట్టుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. తెరపై కనిపించిన విధానం కూడా బాగుంది. వైరల్ వయ్యారి పాటలో అయితే పైసా వసూల్ అనిపించాడు. శ్రీలీల, కిరీటి పోటాపోటీగా ఆ పాటలో ఆడిపాడారు. హీరోయిన్ శ్రీలీల పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల కోసమే అన్నట్టుగా ఆమె తెరపై కనిపిస్తుంది. ఇక, సెకండాఫ్ లో వైరల్ వయ్యారి పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా జెనీలియా కనిపించిన విధానం, ఆమె నటన మెప్పిస్తుంది. కీలకమైన పాత్రతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు కానీ, అందులో నటించేందుకే ఆమెకు పెద్దగా ఆస్కారం లభించలేదు. రావు రమేశ్, రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించి, పరిధి మేరకు నటించారు. అచ్యుత్ కుమార్ విలన్ గా కనిపిస్తారు. అందులో బలం లేదు. వైవా హర్ష, సత్య అక్కడక్కడా కొన్ని నవ్వులు పంచారు. టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి హైలైట్. సెంథిల్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. ఎడిటింగ్, కళ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటల రచయిత కళ్యాణ చక్రవర్తి ఈ సినిమాతో మాటల రచయితగానూ మెప్పించారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకుడిగా పట్టు ప్రదర్శించారు కానీ, రచనలో కొత్తదనం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
ప్లస్ పాయింట్స్ చూస్తే..
ఫస్టాఫ్
కిరీటి హుషారైన నటన
వైరల్ వయ్యారి పాట
మైనస్ పాయింట్స్:
భావోద్వేగాలు
వైవిధ్యం లేని కథ, కథనం
గమనిక: ఈ రివ్యూ కేవలం మా అభిప్రాయం మాత్రమే.

One thought on “రివ్యూ: జూనియర్ సినిమాతో కిరీటి మార్కులు కొట్టేశాడా.. !”
Comments are closed.