రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, జనసేన పార్టీ జనవాణి పని వేళల్లో మార్పులు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. అర్జీదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
కొత్తగా అమలులోకి వచ్చే ఈ పని వేళలు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జనవాణి సేవలు అందుబాటులో ఉంటాయని పార్టీ తెలిపింది. వీటి అమలు ఈ వారం మొదటి రోజు నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పార్టీ పేర్కొంది. వేలాదిమంది తమ సమస్యలను తెలియజేయడానికి జనవాణి కేంద్రాలకు వచ్చి వినతిపత్రాలు అందజేస్తున్నారని వెల్లడించింది.
ఇక ప్రభుత్వంలో భాగమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రజల వినతులను స్వయంగా స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వచ్చిన సమస్యలను అధినేత దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read More : ఏపీ మద్యం స్కాం : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ విచారణ..
