భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా ఖండించారు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్ 2025 సమావేశంలో మాట్లాడిన జైశంకర్, “ఈ ఏడాది మేలో భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ చెబుతున్నది పూర్తిగా అసత్యం. పాకిస్థాన్‌తో మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న జాతీయ ఏకాభిప్రాయం 1970ల నుంచి కొనసాగుతోంది” అని తేల్చిచెప్పారు.
అమెరికా–పాకిస్థాన్ సంబంధాలు తాజాగా బలపడుతున్న తరుణంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల రెండు సార్లు అమెరికా పర్యటించడం, ఆర్థిక, వాణిజ్య, క్రిప్టోకరెన్సీ అంశాలపై చర్చలు జరగడం గమనార్హం.
దేశ ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంచేస్తూ జైశంకర్, “రైతుల ప్రయోజనాలు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, మధ్యవర్తిత్వానికి వ్యతిరేకత వంటి అంశాలపై మేము ఎప్పుడూ రాజీపడము. ఈ విషయాలను అంగీకరించలేని వారు, భారత ప్రజల ముందే ధైర్యంగా చెప్పాలి” అని సవాల్ విసిరారు.
“రైతుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు సిద్ధం కాదని చెప్పండి. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మీరు విలువ చేయరని చెప్పండి. కానీ మేము మాత్రం దేశ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటాము” అని జైశంకర్ గట్టిగా హెచ్చరించారు.
Read More : దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

One thought on “ట్రంప్ వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటు స్పందన”
Comments are closed.