ప్రధాని మెలోని సహా పలువురు మహిళల ఫొటోలు మార్ఫింగ్ .

ఇటలీలో ఒక పోర్న్ వెబ్‌సైట్ సృష్టించిన వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సైట్‌లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని సహా పలువురు ప్రముఖ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం పెద్ద దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రధాని మెలోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిని దిగ్భ్రాంతికరమైన చర్యగా అభివర్ణించారు. భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో 7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న ‘ఫికా’ అనే ఆ వెబ్‌సైట్‌ను నిర్వాహకులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఘటనపై స్పందించిన మెలోని, “జరిగిన విషయంపై నాకు తీవ్ర అసహ్యం కలిగింది. ఇలాంటి అవమానకర చర్యలకు గురైన మహిళలందరికీ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి” అని హెచ్చరించారు. ఆమె ఇంకా, “సాధారణ కంటెంట్ కూడా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారానే రక్షణ పొందగలరు” అని సూచించారు.

ఈ సైట్‌లో ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ ఫొటోలు కూడా మార్ఫింగ్ చేయబడ్డాయి. ఆమె దీనిని తీవ్రంగా ఖండిస్తూ, “ఇది సమాజంలో బలంగా వేర్లు తొక్కిన ‘రేప్ కల్చర్‌’కు నిదర్శనం. ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను సాధారణంగా చూపిస్తూ, సమర్థించే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సైట్లు వికృత మనస్తత్వాలకు వేదికలుగా మారుతున్నాయి” అని విమర్శించారు. గతంలోనూ మెలోని ఇలాంటి వేధింపులకు గురయ్యారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో ఆమె ముఖాన్ని అశ్లీల వీడియోలకు జోడించి ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన తండ్రీకొడుకులపై ఆమె గత ఏడాది కోటి రూపాయల (100,000 యూరోలు) నష్టపరిహారం కోరుతూ కేసు వేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాలు మరింత సంచలనం రేపాయి. 2005 నుంచి కొనసాగుతున్న ‘ఫికా’ వెబ్‌సైట్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ఇంతకాలం చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఈ సైట్‌లో భర్తలే తమ భార్యల ఫొటోలను పంచుకోవడం, ఇతర మహిళల ఫొటోలను వాడి అసభ్యకర పోస్టులు చేయడం, అంతేకాకుండా చిన్నారుల ఫొటోలను అప్‌లోడ్ చేసి పైశాచిక కామెంట్లు చేయడం వంటి దారుణాలు చోటుచేసుకున్నట్లు తేలింది.

ఈ సైట్ కారణంగా నరకం అనుభవించిన మేరీ గలాటి అనే బాధితురాలు, “కేవలం పురుషులకు మాత్రమే సభ్యత్వం ఉన్న ఆ సైట్‌లోకి వెళ్లేందుకు నేను మా నాన్న ఐడీ వాడాల్సి వచ్చింది. అక్కడ భర్తలు తమ భార్యల ఫొటోలను పంచుకునేవారు. ఇంకా నాలుగైదేళ్ల చిన్నపిల్లల ఫొటోలను కూడా తండ్రులే అప్‌లోడ్ చేస్తుండటం చూసి నేను షాక్‌కు గురయ్యాను” అంటూ తన వేదన వ్యక్తం చేశారు.

Read More : జపాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం

One thought on “ప్రధాని మెలోని సహా పలువురు మహిళల ఫొటోలు మార్ఫింగ్ .

Comments are closed.