ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఈ ఉదయం ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ ఘటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి మరింత క్షీణించింది.
ఈ దాడిపై అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ స్పందించారు. క్షిపణి దాడిలో దౌత్య కార్యాలయ భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అయితే సిబ్బందిలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. భద్రతా పరంగా ముందస్తు చర్యగా టెల్ అవీవ్, జెరూసలంలోని అమెరికా దౌత్య కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. గత రాత్రి ఇరాన్ జరిపిన దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడినట్లు తెలిపారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీపై తీవ్రంగా విరుచుకుపడ్డ ఖట్జ్ మాట్లాడుతూ… “ఆ నియంత హంతకుడిగా మారాడు. మా ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీనికి టెహ్రాన్ ప్రజలు భారీ మూల్యం చెల్లించక తప్పదు” అని హెచ్చరించారు.
మరోవైపు, టెహ్రాన్‌లోని ఆయుధ కర్మాగారాల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అత్యవసరంగా ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది.
Read More : బ్రిటిష్ ఎయిర్వేస్ చెన్నై విమానానికి సాంకేతిక లోపం

One thought on “ఇరాన్ క్షిపణి దాడితో అమెరికా కార్యాలయం మూసివేత”
Comments are closed.