IPL 2025 మళ్లీ ప్రారంభం

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచిన ఐపీఎల్ టోర్నమెంట్ మళ్లీ ప్రారంభం కానుంది. మే 17న బెంగళూరులో ప్రారంభమై జూన్ 3న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన మ్యాచుల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం మిగిలిన 17 మ్యాచ్‌లను జైపూర్, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఉప్పల్‌, విశాఖ స్టేడియాలకు అవకాశం లభించకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

మే 29న క్వాలిఫయర్–1తో ప్లేఆఫ్స్ ప్రారంభమవుతాయి. మే 30న ఎలిమినేటర్‌, జూన్ 2న క్వాలిఫయర్–2, జూన్ 3న ఫైనల్‌ జరగనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌కు సంబంధించిన వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. మే 17న చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్‌తో లీగ్ మళ్లీ ప్రారంభమవుతుంది.

ఇక భారత్–పాకిస్తాన్ పరిస్థితులు కొంతమేర సద్దుమణిగినప్పటికీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొనడంపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే పలువురు తమ దేశాలకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం పెద్ద సవాలే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బోర్డు ప్రకారం, ప్రభుత్వం, భద్రతా సంస్థలు, అన్ని కీలక భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన అనంతరం మిగిలిన సీజన్‌ను కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు పేర్కొంది.

Read More : భార్య అనుష్క భావోద్వేగ స్పందన!